NATS: వైభవంగా 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు.. పెరిగిన ఇమేజ్ తో నాట్స్ 2.0 మొదలు
ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో జూలై 4,5,6 తేదీల్లో జరిగిన నాట్స్ (North American Telugu Society – NATS) 8వ తెలుగు సంబరాలు చూసిన వారికి ఒక సంస్థ – 501 (C) సర్టిఫికెట్తో మొదలైన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 15 సంవత్సరాలలో ఇంత ఎత్తుకు ఎదుగుతుందా అని ఆశ్చర్య పడాల్సిందే… కానీ నాట్స్ ప్రయాణం చూస్తే అది సాధ్యం అనే చెప్పుకోవాలి..
టాంపా నగరం ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. నాట్స్ సంబరాలు జరిగిన కన్వెన్షన్ సెంటర్ కూడా డౌన్టౌన్ లో నది ఒడ్డున ఉండి, వచ్చిన వారికి పిక్నిక్ వాతావరణం కల్పించింది. డోనార్స్కి ఏర్పాటు చేసిన డిన్నర్ ఏరియాలో చుట్టూ ఉన్న సీనిక్ అందాలు చూస్తూ కన్నులకు విందు చేస్తే, వివిధ రకాల వంటకాల విందు తోడు అవుతుంది. టాంపా లో ఇంత చక్కని వెన్యూలో సంబరాలు జరపాలని నిర్ణయించి, అత్యంత వైభవంగా నిర్వహించిన ఘనత కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండకే దక్కింది. వెన్యూలో అన్ని చోట్ల ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డ్ లో (LED screens), సినిమా నేపద్యంలో ఏర్పాటు చేసిన రంగ స్థలం, నర్తనశాల పేర్లతో ఏర్పాటు చేసిన రెండు ఆడిటోరియంలో రెండు రోజులు తెలుగు వారితో కళ కళలాడాయి.
ఇక సంబరాలకు వచ్చిన సినీ ప్రముఖులు గురించి చెప్పుకోవాలి. అల్లు అర్జున్ అభిమానులు, జై బాలయ్య అంటూ పద్మవిభూషణ్ నందమూరి బాల కృష్ణ అభిమానులు, విక్టరీ వెంకటేష్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్, అందాల హీరోయిన్ శ్రీ లీల, అలనాటి అందాల తారలు జయసుధ, మీనా, డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన నేటి తారలు ఫరియా అబ్దుల్లా, అరియానా, ఆశు రెడ్డి, అనేక మంది టీవీ తారలు, జబర్దస్త్ కమెడియన్స్, అర్ధరాత్రి 12 గంటల తరువాత కూడా జనాలను కట్టి పడేసిన దేవిశ్రీ ప్రసాద్, తమన్ లైవ్ కన్సర్ట్లతో సంబరాలుకు వచ్చిన అందరూ నిజ్జంగా సంబరాలు చేసుకొన్నారు. ఇంతమంది సినీ తారలను కోఆర్డినేట్ చేసిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందనీయులు.
ప్రతి సంవత్సరం మరికొన్ని సేవలతో, మరికొన్ని ప్రదేశాలలో సేవా కార్యక్రమాలతో కమ్యూనిటకి నాట్స్ దగ్గరవుతున్న విషయం అందరికీ తెలిసిందే.. 2023లో న్యూ జెర్సీ నాట్స్ నాయకులు శ్రీధర్ అప్పసాని కన్వీనర్గా 7వ తెలుగు సంబరాలు ఘనంగా చేసి సంబరాల స్టాండర్డ్స్ స్తాయిను పెంచారు. ఇప్పుడు శ్రీనివాస్ గుత్తికొండ తనదైన శైలిలో ఒక పక్క పెద్ద వారిని కన్విన్స్ చేసి నాట్స్కు పెద్ద ఎత్తున విరాళాలు తెప్పించారు. ఇంకో పక్క అన్ని వర్గాల వారిని సమన్వయ పరుస్తూ 8వ నాట్స్ సంబరాలు ఇంత వైభవంగా నిర్వహించి, నాట్స్ పేరును, ఇమేజ్ ను ఎంతో ఎత్తుకు తీసుకు వెళ్ళారు.
ఈ పేరుతో నాట్స్ కు విరాళాలు ఇచ్చే దాతలు పెరుగుతారని, నాట్స్ చేసే సేవా కార్యక్రమాలు కూడా పెరుగుతాయని వేరే చెప్పక్కర లేదు. అంటే ఈ సంబరాల తరువాత నాట్స్ 2.0తో కొత్త జీవితం ప్రారంభం అన్నమాట. నాట్స్ లీడర్షిప్ కు అభినందనలు.







