NATS: జూలై 4,5,6 తేదీల్లో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) ద్వైవార్షిక మహాసభల్లో భాగంగా 8వ అమెరికా తెలుగు సంబరాలను జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మహా సభల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మదన్ పాములపాటి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మందాడి శ్రీహరిలు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలోని టంపా కన్వెన్షన్ సెంటరు వేదికగా జరగనున్న ఈ తెలుగు సంరంభంలో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా నలుమూలల నుండి పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని, తెలుగువారి సాంస్కృతిక వైభవానికి పట్టం కట్టేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.
సభల నిర్వహణ కమిటీలను ఎంపిక చేశామని, 3లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగిన టంపా కన్వెన్షన్ సెంటరులో ఈ సంబరాల నిర్వహణ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని నాట్స్ పేర్కొంది. రోజుకి 10వేలకు పైగా ప్రవాస అతిథులు ఈ వేడుకల్లో సందడి చేస్తారనే అంచనాల మధ్య నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల విజయవంతానికి సంస్థ ప్రతినిధులు విశేష కృషి చేస్తున్నారు.







