రెండో రోజు ఘనంగా నాట్స్ సంబరాలు
సినీ, రాజకీయ ప్రముఖుల ప్రసంగాలు, సందేశాత్మక నాటికల్లో చిన్నారుల అభినయాలు, సినీ హాస్యనటులు పూయించిన నవ్వుల పువ్వులు, వెరసి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో షికాగోలోని శ్యాంబర్గ్లో నిర్వహిస్తోన్న తెలుగు సంబరాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు, కథానాయకి పూజాహెగ్దే, తెతెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ అమెరికాలోని తెలుగువారంతా ఒకేచోటకు చేరి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్రెడ్డి మాట్లాడుతూ అమెరికా రాజకీయాల్లోనూ తెలుగువారు రాణించాలని పిలుపునిచ్చారు. నాట్స్ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ కొనసాగిస్తోన్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ తెలుగునాట వ్యవసాయం చేస్తున్న అన్నదాతలకు అండగా నిలవాలని ప్రవాసాంధ్రులను కోరారు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చేయూతనివ్వాలన్నారు. ఈ సందర్బంగా నాట్స్ సంబరాల కన్వీనర్ రవి ఆచంట, ఏపీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సినీనటుడు సాయికుమార్ తదితరులు వెంకటేశ్వరరావును సత్కరించారు.
సంబరాల్లో భాగంగా ప్రవాసాంధ్రులు, చిన్నారులు ప్రదర్శించిన మనిషి, గోదా కల్యాణం, ఆముక్త మాల్యద నాటికలు ఆకట్టుకున్నాయి. హాస్యనటులు అలీ, పృథ్వీ బృందం పండించిన హాస్యం కడుపుబ్బా నవ్వించింది. ఇండియన్ ఐడల్-9 సీజన్ విజేత రేవంత్ చేసిన హంగామా ఆకట్టుకుంది. ఇటీవల మరణించిన ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు, ప్రముఖ కవి.సి.నారాయణరెడ్డిలకు వేదికపై నివాళులర్పించారు.













