మిన్నెసొటాలో వైభవంగా నాటా మహిళా దినోత్సవం
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో మిన్నెసోటా విభాగం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అనుకున్న సంఖ్యలో కంటే రెట్టింపుస్థాయిలో జనం వచ్చారని, సమస్త మహిళాలోకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సభాప్రాంగణ అలంకారములు, పసందైన విందు భోజనం, చాయాగ్రహకుల కష్టం మరెన్నో విశేషాలను మహిళా లోకం ప్రస్తావించటం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రూపు డ్యాన్స్‌లు, నాటికలు, కరవోకె సింగింగ్, ఫ్యాషన్ షో, గేమ్స్, గెస్ట్ లెక్చర్స్ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
నాటా – మిన్నెసోటా కార్యనిర్వాహక బృదం ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగటానికి పడ్డ కంషిని మహిళలు గుర్తించినందుకు వినమ్ర నమస్కారం తెలియజేసింది. అదే విధంగా, ఆడవారి కోసం గత కొద్ది రోజులుగా ఎంతో సహాయసహకారాలు అందించిన మగవారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ధనసహాయం అందించిన ధాతృత్వముగల దాతలందరికీ, పేరు పేరునా శిరస్సువంచి నమస్కరిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
నాటా ప్రస్తుత అధ్యక్షులు గోశాల రాఘవ రెడ్డి, కాబోయే అధ్యక్షులు కొర్సపాటి శ్రీధర్, మిన్నెసోటా విభాగం ఉపాధ్యక్షులు పిచ్చాల శ్రీనివాస రెడ్డి, ఎర్రి సాయినాథ్, ప్రాంతీయ సమన్వ్వయకర్తలుగా చింతం వెంకట్, పేరూరి రవి మరియు నారాయణ రెడ్డి, సలహాదారులుగా బండి శంకర్, చౌటి ప్రదీప్ తదితరులు ఈ వేడుక విజయవంతానికి తమవంతు సహకారాన్ని అందజేశారు. కార్యక్రమ నిర్వాహణలో మూర్తి (అలంకరణ), వసుంధర రెడ్డి, దేవరపల్లి సౌజన్య, వుయ్యూరు మాలతి, చీకటి శైల, మిక్కిలినేని జయశ్రీ, బుడగం ప్రవీణ్, యడ్డాల ప్రతీప్ ముఖ్య భూమికను పోషించారు.













