డిసెంబరులో నాటా సేవా కార్యక్రమాలు
రెండేళ్లకోసారి తెలుగు రాష్ట్రాల్లో నాటా డేస్ పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఈ ఏడాది డిసెంబరు 10-24 వరకు నిర్వహించనున్నట్లు నార్త్ అమెరికా తెలగుఉ అసోసియేషన్ (నాటా) అధ్యక్షులు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఏపీలతో పాటు ఈసారి బెంగళూరులోని తెలుగువారి కోసమూ ఈ సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా పలు ప్రాంతాల్లో తాగునీటి శుద్ధి కేంద్రాలు, మరుగుదొడ్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతిభ చూపిన 125 మంది విద్యార్థులకు రూ.10వేల చొప్పున ఉపకారవేతనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు, ఎల్ఈడీ విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు సంస్కృతిని పరిరక్షించాలనే లక్ష్యంతో చిత్తూరు, వరంగల్ పట్టణాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, అక్షరాస్యతపై నడకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది జులై 6 నుంచి మూడు రోజులపాటు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఆటా, టాటా సంస్థలతో కలిసి మెగా కన్వెన్షన్ నిర్వహిస్తున్నామని నాటా సలహాదారు స్టాన్లీరెడ్డి వివరించారు.













