ప్రధాని మోదీ పర్యటనపై.. అమెరికా స్పందన ఇదే
రాబోయే దశాబ్దాల్లో భారతదేశం తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా నిలుస్తుందని అమెరికా పేర్కొంది. ఇరు దేశాల రక్షణ రంగ పరిశ్రమల మధ్య సహకారం మరింత బలపడబోతోందని, చరిత్ర గమనాన్నే ఈ వారం మార్చబోతోందని శ్వేతసౌధం ఆశాభావం వ్యక్తం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో శ్వేతసౌధం, పెంటగాన్, ఇతర వర్గాలు వివిధ అంశాలపై స్పందించాయి. రెండు దేశాల మధ్యనున్న బలమైన, సన్నిహిత సంబంధాలను మోదీ పర్యటన పరిపుష్టం చేస్తుందని శ్వేతసౌధం పేర్కొంది. స్వేచ్ఛాయుత, నియమాల ఆధారిత ప్రపంచ పాలనను పరిరక్షించి ముందుకు తీసుకువెళ్లడంలో అమెరికాతో కలిసి పనిచేయాలన్న కట్టుబాటుతో భారత్ ఉందని వ్యూహాత్మక కమ్యూనికేషన్ల జాతీయ భద్రత మండలి సమన్వయకర్త జాన్కిర్బీ మీడియాకు తెలిపారు. దేదీప్యమానమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్-అమెరికాలు తమ ద్వైపాక్షిక సంబంధాలపై కలిసి పనిచేయడాన్ని కొనసాగించనున్నాయని తెలిపారు. అధ్యక్షుడు బైడెన్ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా, ఏ దేశాల నేతలతో మాట్లాడినా మానవ హక్కుల గురించి తప్పనిసరిగా ప్రస్తావిస్తారని, మోదీతో చర్చల్లోనూ అది రావచ్చని చెప్పారు. రష్యా`ఉక్రెయిన్ యుద్దం విషయం ఈ చర్చల్లో ఒక అంశంగా ఉంటుందని తెలిపారు.






