రేపే అమెరికాకు మోదీ.. పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ ఈ నెల 21 నుంచి 24వ తేదీ దాకా అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ దంపతుల ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోదీ పర్యటన కోసం భారత`అమెరికన్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నద్దమవుతున్నారు. మోదీకి స్వాగత సందేశాన్ని పంపించడానికి రాజధాని వాషింగ్టన్ డీసీ సహా అమెరికా వ్యాప్తంగా 20 నగరాల్లో భారత`అమెరికన్లు తాజాగా ఐక్యతా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో వందలాది మంది ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్లో మోదీ హాజరయ్యే కార్యక్రమంలో పాల్గొనేందుకు టికెట్ల కోసం భారత`అమెరికన్లు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.













