అమెరికాలో పర్యటనలో మోదీ మరో విజయం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో సాధించిన మరో విజయం. అమెరికాలోకి భారతీయుల నిరాటంక ప్రవేశానికి మార్గం సుగమం చేయడం. అంతగా హానికరం కాని ప్రయాణికులను ఆట్టే ఇబ్బంది పెట్టకుండా, ఎయిర్‌పోర్టులో పెద్దగా తనిఖీలు లేకుండా శ్రీఘ్రంగా తమదేశంలోకి రానివ్వడం కోసం అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్స్ ప్రొటెక్షన్ విభాగం గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ పేరుతో ఒక పథాకాన్ని అమలు చేస్తోంది. కొలంబియా, యూకే, జర్మనీ, పనామా, సింగపూర్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, మెక్సికో దేశాలు మాత్రమే ఈ కార్యక్రమంలో ఉన్నాయి. కొత్తగా భారత్ చేరింది. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన దేశాల ప్రజలు అమెరికాలోని కొన్ని ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో దిగినప్పుడు వారిని మిగతా ప్రయాణికుల్లా తనిఖీ చేయరు. పొడుగాటి క్యూల్లో నిలబడి ఇమిగ్రేషన్ అధికారులు వేసే నిశిత ప్రశ్నలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. వారి కోసం ఆటోమేటిక్ గ్లోబల్ ఎంట్రీ కియోస్క్‌లు ఉంటాయి. అయితే, ఈ ప్రోగ్రామ్ ద్వారా వెళ్లాలనుకునేవారు ముందే అనుమతి పొందాలి. ఈ క్రమంలో యూఎస్ వీసా అధికారులు వారి నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ నిర్వహించి, వారితో ఎలాంటి ఇబ్బంది, ప్రమాదం ఉండదని నిర్థారించుకున్నాకనే ఆమోదముద్ర వేస్తారు.













