ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వాములు కండి …. కేటీఆర్
తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని టెలికాం దిగ్గజ కంపెనీలైన నోకియా, ఎరిక్సన్లను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ మూడోరోజు శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని పలు కంపెనీల నిర్వాహకులతో సమావేశమయ్యారు. టెలీకమ్యూనికేషన్లు, నెట్వర్క్ రంగంలో అంతర్జాతీయస్థాయి కంపెనీలు నోకియా, ఎరిక్సన్ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ ఫైబర్‌గ్రిడ్ గురించి వివరించారు. భగీరథతో సమాంతరంగ చేపడుతున్న ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తామని, తద్వారా కమ్యూనికేషన్, ఇంటర్నెట్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాన్ని అభినందించిన నోకియా కంపెనీ ప్రతినిధులు, ఇందులో భాగస్వామ్యలయ్యేందుకు ఆసక్తి చూపారు. త్వరలోనే ఫైబర్ గ్రిడ్ కోసం జారీచేసే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లో పాల్గొంటామని ప్రకటించారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డేటా అనలిటిక్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని, మొబైల్ పరికరాల తయారీ ప్లాంట్నుగానీ లేదా పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్నిగానీ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. దీంతోపాటు ఎరిక్సన్ కంపెనీలో పర్యటించిన మంత్రి అక్కడి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను పరిశీలించారు. ఇంటర్నెట్ అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆ రంగంలో ఎరిక్సన్ చేస్తున్న పలు పరిశోధనలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.













