కెంటక్కీ రాష్ట్రంలో మంత్రి గంటా పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అమెరికాలోని కెంటక్కీ రాష్ట్రంలో పర్యటించి మంత్రి గంటా పలు వర్శిటీలను సందర్శించారు. అనంతరం కెంటక్కీ రాష్ట్ర సెక్రటరీతో మంత్రి సమావేశమయ్యారు. అలాగే కెంటక్కీ రాష్ట్ర క్యాబినెట్ కార్యదర్శి టెర్రీ గిల్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎర్రాన్ ప్రిస్లేతోనూ గంటా భేటీ అయ్యారు. కెంటక్కీ రాష్ట్రంలోని వర్సిటీల్లో ఏపీ విద్యార్థులకు ఫీజు రాయితీ అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
పరిశోధన, స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్చేంజ్లపై ఒప్పందాలు చేసుకొనే దిశగా సమావేశం కొనసాగింది. పరిశ్రమ రంగానికి సంబంధించి కోర్సులపై కెంటక్కీ కార్యదర్శి ఆసక్తి కనబరిచారు. అలాగే లూయిస్ విల్లీ యూనివర్శటీ ప్రెసిడెంట్తోనూ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్చేంజ్ అంశాలపైనా, ఫీజు రాయితీ అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. ఈ పర్యటనలో ఆయన వెంట అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి, ఎపి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సలహాదారు ఈదర వెంకట్ తదితరులు ఉన్నారు.













