అమెరికాలో మూతపడుతున్న సంస్థలు…
అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం బాగా ఉంటోంది. దీనికారణంగా ఆర్థిక పరిస్థితులు అక్కడ మారిపోతున్నాయి. ఎన్నో కంపెనీలు ఈ వైరస్ కారణంగా తమ ఆదాయాన్ని కోల్పోయాయి. దాంతో తమ కంపెనీలను నిర్వహించలేక మూతవేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మూత కారణంగా ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి అక్కడ ఎదురవుతోంది. అమెరికన్లతో పాటు అక్కడ చదువుకోవడానికి వెళ్లి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న భారతీయులతో సహా పలు దేశాల యువత ఇప్పుడు రోడ్డున పడుతోంది. తాజాగా అమెరికాలో రిటైల్ దిగ్గజం మాసీస్ ప్రకటన ప్రకంపనలు సృష్టిష్టిస్తోంది. తన వద్ద పనిచేసే లక్షా 30 వేల మందిలో అత్యధికులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కేవలం బేసిక్ ఆపరేషన్లను నిర్వహించేందుకు మాత్రమే ఉద్యోగులను ఉంచుకోనున్నట్టు స్పష్టం చేసింది.
దీంతో అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య 47 మిలియన్లకు చేరుతుందని ఫెడరల్ రిజర్వ్ అంచనా వేసింది. కరోనా వల్ల తన 500 గొలుసుకట్టు దుకాణాలను మూసేస్తున్నట్టు మాసీస్ వెల్లడించింది. వీటిలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించమని స్పష్టం చేసింది. కాగా, గత నెలలోనే కంపెనీ ఇప్పటికే 125 గొలుసుకట్టు దుకాణాలను ఆర్థిక ఇబ్బందుల వల్ల మూసివేసింది. ఇదిలావుండగా, అమెరికా ఆర్థిక వ్యవస్థ గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కుదుపులకు గురికావడం ఖాయమని సెయింట్ లూయిస్ ఫెడ్ ఆర్థిక నిపుణుడు మిగువల్ ఫరియా కాస్ట్రో వ్యాఖ్యానించారు. గతవారం అమెరికాలో 3.28 మిలియన్ నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 47 మిలియన్లకు చేరుకోనుంది. నిరుద్యోగులకు ఇచ్చే భృతి కోసం ఒన్ స్టాప్ కెరీర్ సెంటర్ల ముందు ఇప్పుడు చాంతాండంత బారులు కనిపిస్తున్నాయి. మార్చి 14 నుంచి 21వ తేదీ మధ్య మూడు మిలియన్ల మంది నిరుద్యోగులు భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో అంటే 1982 అక్టోబర్లో మాత్రమే అత్యధిక స్థాయిలో అంటే దాదాపు ఏడు లక్షల మంది నిరుద్యోగ భ•తి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
అధ్యక్షుడు రెండు ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన పథకాన్ని ప్రకటించినా అప్పటికే ఆలస్యమైందని పలు కంపెనీలు వాపోతున్నాయి. అమెరికాలో 182 ఏళ్ల నుంచి నడుస్తున్న రెస్టారెంట్ డెల్మొనికోస్ కూడా మూతపడింది. తన సిబ్బంది కోసం ‘గో ఫండ్ మి’ అంటూ సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. రెస్టారెంట్లలో పనిచేసే అయిదు నుంచి ఏడు మిలియన్ల ఉద్యోగులు రోడ్డున పడ్డారని రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. అదేవిధంగా డిజైనర్ చెప్పుల కంపెనీలు, వస్త్ర దుకాణాలు కూడా మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. నేడో రోపో మా పరిస్థితి అంతే అని వాటి అసోసియేషన్లు ప్రకటిస్తున్నాయి. అందరూ మూకుమ్మడి త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలకు చెందిన ఒక లక్షా 90 వేల డిజైనర్ చెప్పుల దుకాణాలు మూతపడ్డాయి.













