ఆ సత్తా భారత్ కు ఉంది : పాంపియో
చైనా ఏక ఛత్రాధిపత్యాన్ని పక్కకునెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్‌కే ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా భారత్ తన మార్కెట్‌ను మరింత విస్తృతం చేయాలని సూచించారు. అమెరికా కంపెనీలు భారత్‌లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు, వాణిజ్యం చేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ సదస్సులో పాంపియో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సదస్సులో ఆయన ప్రసగించారు.
అమెరికా సహా ప్రపంచ దేశాల నమ్మకాన్ని సంపాదించిన భారత్ చైనాకు పక్కకునెట్టి గ్లోబల్ వాణిజ్య శక్తిగా ఎదగగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రపంచ దేశాలు చైనా కంపెనీలపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా టెలీకమ్యూనికేషన్, వైద్య సామగ్రి సహా పలురంగాల్లో ప్రపంచదేశాల అవసరాలను తీర్చే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ.. భారత్, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పాంపియో అభిప్రాయపడ్డారు.













