మైక్రోసాఫ్ట్ శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్!
కరోనా వైరస్ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కంపెనీలు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ చేరింది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు తమకు నచ్చితే పర్మనెంట్‌గా ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని కల్పించనున్నారు.
కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా వరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అమెరికాలోని తన ఆఫీసులను జనవరి వరకు ఓపెన్ చేసేది లేదని కూడా మైక్రోసాఫ్ట్ ఇప్పటికే సృష్టం చేసింది. ఒకవేళ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయాలనుంటే, వాళ్ల ఆఫీసులో తమ స్పేస్‌ను వదులుకోవాల్సి ఉంటుందని సంస్థ చెప్పింది. కొవిడ్ 19 అనేక సవాళ్లను విసిరిందని, కొత్త పద్ధతుల్లో జీవించడం, పని చేయడం నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్యాధ్లీన్ హోగన్ తెలిపారు. వ్యక్తిగత వర్క్ స్టయిల్‌ను మద్దతు ఇచ్చేందుకు వీలైనంత సహకరిస్తామని, అదే విధంగా వ్యాపారం కూడా కొనసాగేలా చూస్తామన్నారు. పర్మనెంట్ పద్ధతిలో ఇంటి నుంచి పని చేయాలనుకున్న వాళ్లు తమ మేనేజర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.













