సత్య నాదెళ్ల భారత పర్యటన!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మరోసారి భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల చివరిలో వినియోగదారులు, యువ విజేతలు, విద్యార్థులు, డెవలపర్లు, వ్యవస్థాపకులను కలుసుకునేందుకు భారతదేశాన్ని సందర్శించనున్నారు. సత్యా నాదెళ్ల పర్యటనను ధృవీకరించి మైక్రోసాఫ్ట్ సంస్థ, ఆయన ఇండియాకు వచ్చే తేదీలు, పర్యటించే నగరాల గురించి వివరాలు ఇవ్వలేదు. అయితే ఫిబ్రవరి 24-26 వరకు నాదెళ్ల భారత్లో పర్యటించనున్నారని భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, ఆర్థిక రాజధాని ముంబై నగరాలను సందర్శించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా దేశంలో పరిశ్రమ పెద్దలతోపాటు, కొంతమంది ప్రభుత్వ కార్యకర్తలను కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు అంతేకాదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటికీ కూడా నాదెళ్ల ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.













