అందుకే మ్యారేజీ కౌన్సిలింగ్ కావాలని కోరాను : మిషెల్
కొన్ని కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉండదు. అంత మాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తాను మ్యారేజ్ కౌన్సిలింగ్కు వెళ్లిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేము రోల్ మోడల్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం. కొన్నిసార్లు వివాహ బంధం నుంచి వైదొలగాలని అన్పిస్తుంది. ఎవరికైనా ఇది సహజం. నాకు కూడా చాలాసార్లు అలాగే అన్పించింది. అందుకే మ్యారేజ్ కౌన్సిలింగ్ కావాలని కోరానని మిషెల్ పేర్కొన్నారు. కౌన్సిలింగ్ జరిగిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అభిప్రాయ బేధాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టామని, అందుకే చాలా విషయాల్లో తాను చేసే చిన్న చిన్న తప్పులేంటో తెసిసొచ్చాయని మిషెల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పటి నుంచి తన భర్తతో పాటు ఇతరులను కూడా సహాయం అడిగే చొరవ లభించిందని పేర్కొన్నారు. మ్యారేజ్ కౌన్సిలింగ్కు వెళ్లడం వల్ల దంపతుల మధ్య అభిప్రాయ భేధాలు తొలగిపోయి, ఆ బంధం మరింత బలపడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్కు వెళ్లాల్సి వస్తే ఏమాత్రం ఇబ్బంది పడవద్దని మిషెల్ సూచించారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా-మిషెల్ వివాహం 1992లో జరిగింది. వీరికి మాలియా, సాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే.













