ఆటాలో అమెరికన్ తెలంగాణ సొసైటీ సంస్థ విలీనం
అమెరికాలో జాతీయ తెలుగు సంఘమైన ఆటాలో మరో జాతీయ సంస్థ అమెరికన్ తెలంగాణ సొసైటీ విలీనం అవడంపై హర్షం వ్యక్తం అవుతోంది. అట్లాంటాలో సెప్టెంబర్ 9 న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో ఈ విలీన ప్రక్రియ జరిగింది. సమావేశం ప్రధాన అంశంగా అమెరికన్ తెలంగాణ సొసైటీ, ఆటాలో విలీనం చేసుకోవడంతోపాటు, 18 వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ ఉత్సవాలను మరింత ఉత్సాహంతో నిర్వహించడానికి వీలుగా అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. చరిత్రాత్మక వికాసంగా అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆధికారికంగా అమెరికా తెలుగు సంఘంలో విలీనం కావడంతో ఆటా ఇప్పుడు మరింత బలంగా కార్యక్రమాలను నిర్వహించనున్నది.
అట్లాంటా లో జరిగిన ఆటా మూడవ బోర్డు సమావేశంలో ఈ విలీన నిర్ణయాన్ని అధికారికంగా గౌరవంగా ప్రకటించబడింది. పలు దశాబ్దాలుగా అమెరికాలోని ప్రవాసాంధ్రుల ప్రజా సేవా సారథిగా ఘన చరితను కైవశం చేసుకుంటున్న ఆటా సంస్థతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సగౌరవంగా, ప్రకాశవంతంగా ప్రజ్వలింపచేస్తున్న అమెరికన్ తెలంగాణ సొసైటీ మమేకం అవడం అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఇరు మహోత్తర సేవా సంస్థల కలయిక పరస్పర సహకారాలతో సాంప్రదాయ, సాంస్కతిక, సాంఘిక, సామాజిక , విద్య, వైద్య , సంక్షేమ కార్యక్రమాలతో అమెరికాలో వున్న తెలుగు ప్రజలను మరింత ఆదరించనున్నది.
ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ ఈ మహత్తర కలయిక ఎన్నో అత్యద్భుత సేవా కార్యక్రమాలకు నాంది అంటూ హర్షం వ్యక్తం చేశారు. అమెరికన్ తెలంగాణ సొసైటీ అధ్యక్షులు నరేందర్ చేమెర్ల మాట్లాడుతూ అమెరికా తెలుగు సంఘం (ఆటా) సంస్థ తో విలీనం ‘‘ప్రవాసాంధ్రుల మరియు భావి భారతీయుల పట్ల సేవా సంకల్పానికి అసమాన బలం అని తమ ఆనందోత్సాహాలను వ్యక్తపరిచారు.
సెప్టెంబరు 9 సాయంత్రం జరిగిన ఆటా కిక్ ఆఫ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మంది స్థానిక తెలుగు సంఘాల నేతలు హాజరవ్వగా ఆటా కన్వెన్షన్ లోగో మరియు కిక్ ఆఫ్ సాంగ్ ఆవిష్కరణ, విరాళాల సేకరణ, అడ్హాక్ టీం ప్రకటన, కన్వెన్షన్ కోర్ కమిటీ సభ్యుల పరిచయం, అధ్యక్షులు శ్రీమతి మధు బొమ్మినేని గారి ప్రోత్సాహభరిత ప్రసంగం వంటి పలు ప్రధాన అంశాలతో ఆటా 2024 కన్వెన్షన్ కై ముమ్మర సన్నాహాలతో అంకురార్పణ చేశారు.ఈ అడ్హాక్ బృందం సభ్యులుగా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ,ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షులు భువనేశ్ బూజాల , కన్వీనర్ కిరణ్ పాశం, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొడ్డిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, మరియు ఇతర ఆటా విశిష్ఠ నాయక బృందాన్ని సభాముఖంగా ప్రకటించింది. భారత దేశంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో జరుగనున్న ఆటా వేడుకలు 2023 డిసెంబరు నెలలో 10 నుండి 30 వరకు నిర్ణీతమయినవిగా ప్రకటించారు.
ఆటా మరియు 18 వ ఆటా మహాసభలను గురించిన పూర్తి సమాచారం http://www.ataworld.org నందు పొందగలరు.













