ATA: ఆటా ఆధ్వర్యంలో సునీతా కృష్ణన్‌తో ‘మీట్ అండ్ గ్రీట్’
ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, పద్మశ్రీ డాక్టర్ సునీతా కృష్ణన్ (ప్రజ్వల వ్యవస్థాపకురాలు)తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం విజయవంతమైంది. న్యూయార్క్, న్యూజెర్సీలలో 50 మందికి పైగా మహిళలు, వ్యాపార ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శతాబ్దాలుగా వేధింపులకు గురవుతున్న బాలికలు, మహిళల ట్రాఫికింగ్ సమస్యలపై డాక్టర్ సునీతా కృష్ణన్ (Sunitha Krishnan) తన దశాబ్దాల అనుభవాన్ని పంచుకున్నారు. ఆరు నెలల చిన్నారి నుంచి 40 ఏళ్ల మహిళల వరకు బాధితులుగా ఉన్నారని, ఇప్పటివరకు 32,000 మందికి పైగా బాధితులను ప్రజ్వల రక్షించిందని, 28,000 మందికి పునరావాసం కల్పించిందని వివరించారు. ఈ సందర్భంగా నివారణ, రక్షణ, పునరావాస ప్రయత్నాలకు సహాయపడే మార్గాలపై ప్రశ్న-జవాబు సెషన్ జరిగింది.
ఆటా (ATA) సభ్యులు స్వయంగా తమ పునరావాస కార్యక్రమాలను చూడటానికి హైదరాబాద్‌లోని ప్రజ్వల బేస్ క్యాంప్‌ను సందర్శించాలని ఆమె (Sunitha Krishnan) ఆహ్వానించారు. ఇటీవల షార్జా బుక్ ఫెయిర్‌లో ఉత్తమ అంతర్జాతీయ పుస్తకం (నాన్-ఫిక్షన్) అవార్డు గెలుచుకున్న తన జ్ఞాపకాల పుస్తకం “ఐ యామ్ వాట్ ఐ యామ్’’ (I Am What I Am)ను కొనుగోలు చేసే అవకాశం కూడా హాజరైన వారికి దక్కింది. ఆటా (ATA) అధ్యక్షుడు జయంత్ చల్లా, డాక్టర్ సునీతా కృష్ణన్‌కు (Sunitha Krishnan) కృతజ్ఞతలు తెలిపారు. సుధీర్ దామిడి (కాన్ఫరెన్స్ డైరెక్టర్), ప్రాంతీయ సమన్వయకర్తలు జీనత్ కుండూర్, పార్ధ బైరెడ్డి, నరసింహ కాటిపల్లి, లిటరరీ చైర్ వేణు నక్షత్రం, సేవ కో-చైర్ రమేష్ భీమ్రెడ్, మహిళా సలహాదారులు లావణ్య రావులపల్లి, కవిత చల్లా, అవంతి నక్షత్రం తదితర ఆటా (ATA) సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






