MATA: యువతకు సాంకేతిక కోర్సుల సర్టిఫికెట్లు అందించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ యువతకు అజూర్, ఏఐ వంటి అత్యాధునిక సాంకేతిక విద్యను ఆన్‌లైన్‌లో అందించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK)తో మన అమెరిక తెలుగు అసోసియేషన్ (MATA) గతేడాది ఒప్పందం చేసుకుంది. ఈ విద్య అందించిన తర్వాత సదరు విద్యార్థులకు ఉద్యోగాలు చూపించేందుకు కూడా మాటా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది కాలంలో సుమారు 300 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చి గ్రామీణ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కూడా కల్పించాయి. ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని హైదరాబాద్ వేదికగా మాటా (MATA), టాస్క్ (TASK) సంస్థలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు (Sridhar Babu) ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను, మాటా, టాస్క్ సంస్థల కృషిని కొనియాడారు. ఆయన చేతుల మీదుగానే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన అందరికీ పేరుపేరునా మాటా ధన్యవాదాలు తెలియజేసింది.
మహబూబ్‌నగర్‌లో భారీ హెల్త్ క్యాంప్
మాటా (MATA) ఆధ్వర్యంలో మహబూబన్ నగర్ జిల్లాలోని పుదూర్ వద్ద భారీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వెయ్యికిపైగా కుటుంబాలు ఈ క్యాంప్‌లో వైద్యుల సేవను అందుకున్నాయి. కళ్లు, డెంటల్, ఫిజికల్, ఆర్థో, న్యూరో, కార్డియాక్, ఈఎన్‌టీ, పీడియాట్రిషియన్, గైనకాలజీస్ట్ సహా పలు విభాగాలకు చెందిన వైద్యులు ఈ క్యాంప్‌లో తమ సేవలను ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమకు సహకరించిన సాయి ఓరల్ ఫౌండేషన్, భాస్కర్ హాస్పిటల్స్, ఎంఎస్ రెడ్డి ఐ హాస్పిటల్స్, రవి హీలియోస్ హాస్పిటల్స్‌కు మాటా (MATA) కృతజ్ఞతలు తెలియజేసింది.