MATA: దృశ్య దివ్యాంగ చిన్నారులకు మాటా భరోసా.. డిజిటల్ గైడ్ పరికరాల పంపిణీ
హైదరాబాద్: ప్రవాస తెలుగు సంస్థ ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) సేవా దృక్పథంతో మరో ముందడుగు వేసింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (తెలంగాణ రాష్ట్ర విభాగం) సహకారంతో 100 మంది దృశ్య దివ్యాంగ చిన్నారులకు అత్యాధునిక ‘డిజిటల్ గైడ్’ పరికరాలను అందజేసింది. లోక్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ పరికరాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్యాభివృద్ధికి సాంకేతికతను జోడించి మాటా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చిన్నారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని ఆయన పేర్కొన్నారు. మాటా (MATA) అధ్యక్షులు కిరణ్ దుద్దాగి మాట్లాడుతూ.. సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల పిల్లల సాధికారతకు తమ సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ పరికరాలు చిన్నారుల రోజువారీ అభ్యసనలో ఎంతో తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి దానకిషోర్, ఓ.ఎస్. రెడ్డి, భవానీ శంకర్, ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్, ప్రొఫెసర్ శ్రీరాములు, మాటా కన్వీనర్ శ్రీధర్ గుడాల, శేఖర్ తో పాటు దాదాపు 400 మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






