అలరించిన ఆటా సాహిత్య కార్యక్రమాలు
అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రతీ రెండేళ్లకోసారి ఘనంగా జరుపుకునే ఆటా మహాసభల్లో భాగంగా నిర్వహించిన సాహితీ సదస్సులో, పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొని సదస్సుని విజయవంతం చేశారు. ఈ సదస్సు జూన్ 8, 9 తేదీల్లో అట్లాంటాలో జరిగింది.
మొదటిరోజు సాహిత్య సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రముఖ కవులు నందిని సిధారెడ్డి, అఫ్సర్ సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా నవలల పోటీలో బహుమతి పొందిన నవల “ఉణుదుర్తి సుధాకర్-చెదరిన పాదముద్రలు”ను ఆవిష్కరించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆటా చేస్తున్న సాహిత్య కృషిని ప్రస్తావించారు.
ఆ తర్వాత “సినిమా-సాహిత్యం” పేరుతో నిర్వహించిన చర్చలో- సినిమాకి, సాహిత్యానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి, ప్రముఖ దర్శకులు వి. ఎన్. ఆదిత్య, యువ సినీ రచయిత నాగేంద్ర కాశీ, సమన్వయకర్త శివ సోమయాజులతో ఆసక్తికరమైన చర్చను చేశారు.
మొదటి రోజు చివరి కార్యక్రమం “విభిన్న స్వరాల వేదిక”లో ప్రముఖ కవులు వడ్డేపల్లి క్రిష్ణ, అంబికా అనంత్, మమత, ఖాజా మన్సూర్, నందకిషోర్, సాయి లక్కరాజు వివిధ సాహిత్య అంశాల గురించి మాట్లాడారు.
రెండవ రోజు ఉదయం జరిగిన అష్టావధానంలో అవధాని బ్రహ్మశ్రీ శ్రీచరణ్ పాలడుగు, సంచాలకులు నేమాని సోమయాజులు, పృచ్ఛకులు సురేష్ కొలిచాల, భోగారావు పప్పు, కృష్ణ వేదుల, స్నేహ బుక్కరాయసముద్రం, సుబ్బు భాగవతి, దివాకర్ జమ్మలమడక, ఫణి డొక్కా, ప్రకాశరావు కొల్లారపు, శ్రీనివాస భరద్వాజ, శ్యామ్ సుందర్ యల్లంరాజు పాల్గొన్నారు.
రెండవ రోజు మధ్యాహ్నం జరిగిన “సమకాలీన కథ” చర్చలో ప్రముఖ కథకులు నారాయణ స్వామి శంకగిరి, మధు పెమ్మరాజు, చంద్ర కన్నెగంటి, అనిల్ రాయల్, మన్నెం సింధు మాధురి పాల్గొని వర్తమాన కథ గురించి కూలంకషంగా చర్చించారు.
“నవలా సమయం” పేరుతో నిర్వహించిన తర్వాతి చర్చలో ప్రముఖ నవలా రచయితలు గొర్తి బ్రహ్మానందం, రెంటాల కల్పన, పాఠకురాలు పద్మవల్లి పాల్గొన్నారు.
చివరి కార్యక్రమంలో సోమయాజుల శివ, తనికెళ్ళ భరణి సాహిత్య ప్రయాణం గురించి ఆయనతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ రెండు రోజుల సాహిత్య సదస్సుని సమన్వయకర్త రవి వీరెల్లి, సహ-సమన్వయకర్త మాధవి దాస్యం విజయవంతంగా నిర్వహించారు.







