వర్క్ పర్మిట్లు రద్దు చేయొద్దు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రవేశపెట్టిన వర్క్ పర్మిట్ విధానాన్ని రద్దు చేయవద్దని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన 15 మంది చట్టసభ సభ్యులు కోరారు. ఈ పర్మిట్లను రద్దు చేస్తే, హెచ్-1బీ వీసాదారుల భార్యలు ఉద్యోగాలు కోల్పోతారనీ, ముఖ్యంగా దీని వల్ల భారత్‌కి చెందిన ఐటి నిపుణులు ఎక్కువ నష్టపోతారని వారు హోంశాఖ కార్యదర్శి క్రిస్ట్‌జెన్ ఎనీల్సెన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎక్కువ నైపుణ్యం కలిగిన ఐటి నిపుణులకు ప్రోత్సాహకంగా ఉంటుందనే ఒబామా ఈ వర్క్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టారనీ, ఆ విధానాన్ని తొలగిస్తే ఆ నిపుణులంతా నిరాశకు గురి అవుతారని కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌ని హెచ్చరించారు.
ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని రద్దు చేయడం కోసం కోర్టును ఆశ్రయించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యలో వీరంతా ట్రంప్‌ని ఉద్దేశించి ఈ లేఖ రాశారు. అయితే, నీల్సెన్ నుంచి సమాధానం వచ్చినట్టుగా వారు పేర్కొనలేదు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ఐటి నిపుణుల సతీమణులకు ఈ విధమైన సౌకర్యం 2015 వరకు ఉండేది కాదనీ, ఆర్థికంగా వారు ఇబ్బందులు పడుతూఉండేవారనీ, దాంతో వారు ఆశించిన లక్ష్యాల మేరకు తమ విధులను నెరవేర్చవారు కాదనీ, దాంతో ఒబామా ప్రభుత్వం ఈ వర్క్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ సభ్యులు ఆ లేఖలో పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఒక సభ్యుని ఆదాయంపై జీవించడం ఏ కుటుంబానికైనా కష్టమని వారు పేర్కొన్నారు. కాగా, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్, కాంగ్రెస్ సభ్యుడు ఆర్ ఖన్నాలు ఒక ప్రకటనలో పేర్నొన్నారు.











































































