అతిపెద్ద ప్రధాన సంఖ్యను కనిపెట్టిన అమెరికన్
అమెరికాకు చెందిన జొనాథన్ పేస్ అనే ఎలక్ట్రికల్ ఇంజినీర్ అతిపెద్ద ప్రధాన సంఖ్యను కనిపెట్టారు. దీనిలో 2,32,49,425 అంకెలున్నాయి. 2ను 2తో 7,72,32,917 సార్లు గుణించి, అందులో నుంచి 1 తీసివేస్తే ఈ ప్రధానసంఖ్య వస్తుంది. 2ను ఇతో గుణిస్తూ పోయి, చివరికి 1 తీసివేయగా వచ్చే ప్రధాన సంఖ్యలను మెర్సెన్ ప్రధానసంఖ్య అంటారు. వీటిపై 350 ఏళ్లకు పూర్వం, ఫ్రెంచ్ మేధావి మారిన్ మెర్సెన్ అధ్యయనం చేశారు. కొత్త మెర్సెన్ ప్రధానసంఖ్యలను గుర్తించేందుకు గింప్స్ అనే స్వచ్ఛంద ప్రాజెక్టు నడుస్తోంది. గింప్స్ అందించే ఉచిత సాఫ్ట్వేర్ను వాడుతూ వేలాదిమంది ప్రధానసంఖ్యలను గుర్తించేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజా ప్రధానసంఖ్యను గుర్తించేందుకు, ఏకబిగిన ఆరు రోజులపాటు కంప్యూటర్ గణనలు చేసింది. పేస్ కృషికి రూ.1.98 లక్షలు బహుమతిగా లభించబోతుంది. వంద కోట్ల అంకెలున్న ప్రధానసంఖ్యను కనిపెట్టేవారికి రూ.94 లక్షలు గింప్స్ అందిస్తుంది.













