మరో మిలియన్ డాలర్లు ఇస్తా : లక్కిరెడ్డి హనిమిరెడ్డి
తెలుగు సంస్కృతి, కళల ఔన్నత్యాన్ని నిలుపుతూ వాటి పరిరక్షణ, అభివృద్ధికి నిరంతరం పాటుపడే వారు ఎవరైనా సరే తనను సంప్రదిస్తే మరో మిలియన్ డాలర్లు విరాళంగా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాలిఫోర్నియా ప్రముఖుడు, దాత, కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన డా. లకిరెడ్డి హనిమిరెడ్డి పేర్కొన్నారు. మిల్పిటాస్లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అఖిల అమెరికా కూచిపూడి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భగవంతుడు తనకు లక్ష్మీదేవిని విరివిగా అనుగ్రహించాడని, అందుకే తెలుగువారి ఉనికికి ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పే అర్హులెవరికైనా తాను మరో మిలియన్ డాలర్లు విరాళంగా అందిస్తానని పేర్కొన్నారు. డా.లకిరెడ్డి కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరంలో ఏర్పాటు చేసిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ భవనానికి ఇప్పటికే మిలియన్ డాలర్లు (రూ.6.6 కోట్లు) విరాళంగా అందించారు. ఈ భవంతిని ఆయన గౌరవార్థం డా.లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంగా సిలికానాంధ్ర ప్రతినిధులు నామకరణం చేశారు.
సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభోట్ల ఆనంద్ మాట్లాడుతూ కొండా నవ్య మెత్రి, కూచిభొట్ల అనుషా వంటి వారిని పరిచయం చేస్తూ స్టాన్ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారని భావితరానికి చెందిన వీరు అమెరికా ప్రతినిధులుగానే గాక తెలుగువారి ప్రతిబింబాలుగా కూడా రాణిస్తారని పేర్కొన్నారు. అనంతరం సిలికానాంధ్ర సీఈఓ రాజు చామర్తి, సీఎఫ్ఓ దీనబాబు కొండుభట్ల, ప్రముఖ కూచిపూడి నాట్యాచారిణి బాలా కొండలరావు, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు డా.పప్పు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.













