లక్కిరెడ్డి హనిమిరెడ్డి సేవలు ప్రశంసనీయం
ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాలకు అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి చేస్తున్న సహాయం ప్రశంసనీయమని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్ధుల్లో సైన్స్ పట్ల అవగాహన పొందడం కోసం ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ విభాగాన్ని మైలవరంలో దేవినేని ఉమ ప్రారంభించి మాట్లాడారు. దీని ఏర్పాటుకు హనిమిరెడ్డి రూ.75 లక్షలు విరాళంగా అందించారని అంటూ, ఇప్పటి వరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు ఆయన 60కోట్ల రూపాయలకు పైగా విరాళం ఇచ్చారని చెప్పారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు ముందుకు రావాలని మంత్రి ఉమా కోరారు. మైలవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఖర్చుతో వివిధ సంస్థలను ఏర్పాటు చేస్తున్న డా.హనిమిరెడ్డికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో సైన్స్ అభివద్ధి కోసం పెద్ద ఎత్తున కషి చేస్తున్న అగస్త్య ఫౌండేషన్ మైలవరం ప్రాంతంలో విద్యార్ధుల కోసం శాఖను ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఫౌండేషన్ చైర్మన్ రాంజీ రాఘవ మాట్లాడుతూ భారతదేశంలో పందొమ్మిది రాష్ట్రాల్లో 200 మొబైల్ వాహనాల ద్వారా అగస్త్య ఫౌండేషన్ విద్యార్ధులకు శాస్త్రీయ పరిశోధనల పైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 175 ఎకరాల స్థలంలో అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆధునిక పరిశోధనశాలలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు, విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ తాము సంపాదించిన దానిలో పేద విద్యార్ధులకు సహాయం చేయడం కోసం వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంకోసం ఎక్కువగా విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు. విద్యాభివద్ధికి, గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు సైన్స్పట్ల అవగాహన కోసమే తాను అగస్త్య ఫౌండేషన్ శాఖ ఏర్పాటుకు 75లక్షల విరాళాన్ని అందించినట్లు చెప్పారు. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని హైస్కూల్ స్థాయి నుండి విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జానకిరాం, డా.హనిమిరెడ్డి సతీమణి విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల స్థానిక ప్రముఖుడు గోగులమూడి సత్యనారాయణరెడ్డి, ఎమ్మార్వో పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.













