కృష్ణా జిల్లాలో డిజిటల్ తరగతులకు హనిమిరెడ్డి భారీ విరాళం
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నారైల విరాళంతో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసేందుకు విరాళం ఇవ్వాల్సిందిగా కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం కోరిక మేరకు అమెరికాలో ఉన్న తెలుగు ప్రముఖుడు, గుండె వైద్య నిపుణుడు డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి జిల్లాకు దాదాపు 50వేల డాలర్లను (35 లక్షల రూపాయలను) విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే వివిధ సేవా కార్యక్రమాలకోసం 60 కోట్ల రూపాయలమేరక విరాళాన్ని ఇచ్చిన హనిమిరెడ్డి ఇప్పుడు కృష్ణా జిల్లాలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు కూడా పెద్దమొత్తంలో విరాళాన్ని ఇచ్చి మరోసారి జన్మభూమిపై తనకు ఉన్న మమకారాన్ని చాటి చెప్పారు.
ఏపీ జన్మభూమి పథకం క్రింద కష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మిస్తున్న డిజిటల్ తరగతి గదులకు ఈ నిధులను వినియోగిస్తారు. డిజిటల్ తరగతుల ఏర్పాటుకు భారీగా విరాళమందించిన హనిమిరెడ్డికి జయరామ్ కోమటి ధన్యవాదాలు తెలియజేశారు.













