NATS: నాట్స్ వేదికపై కృష్ణకాంత్ బరికి సత్కారం
నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో కృష్ణకాంత్ బరి గారికి ఘనసత్కారం జరిగింది. విశాఖపట్టణం నుంచి 2000వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో కృష్ణకాంత్ (Krishna Kanth) చదువుకున్నారు. అదే యూనివర్సిటీకి తన తల్లిదండ్రులు నాగేశ్వరరావు, రామతులసి, బావగారు రాఘవేంద్రరావు పేరిట భారీ విరాళం ఇచ్చి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. వర్సిటీలో కృష్ణ బరి కాన్ఫరెన్స్ రూం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ముగ్గురు పీహెచ్‌డీ స్కాలర్స్‌కు ఉచితంగా విద్య అందిస్తున్నారు కృష్ణకాంత్. పుట్టిన ఊరులో కూడా ఓల్డేజ్ హోం అవసరాలను తీరుస్తున్నారు. ఎందరో బీటెక్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నారు. కాకినాడ ఆస్పత్రికి వెంటిలేటర్స్ అందించి కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన కృష్ణకాంత్‌ను నాట్స్ 8వ తెలుగు సంబరాల వేదికపై గౌరవించారు. ఆయన తల్లిగారికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్, తదితరుల చేతుల మీదుగా ఘనసత్కారం చేశారు. మన జీవితంలో ఎదగడానికి ఎవరో ఒకరు సహాయం చేస్తారని, అదే సహాయాన్ని మనం ఎదిగిన తర్వాత అవసరంలో ఉన్న వారికి అందించాలని కృష్ణకాంత్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్ పిన్నమనేని, గుత్తికొండ శ్రీనివాస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.







