ఖమ్మం యువకుడి ఘనత
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. సరైన రోడ్డు కూడా లేని మారుమూల పల్లెటూరు. అయితేనేం సాధించాలన్న అతడి పట్టుదల ముందు ఆ అవరోధాలన్నీ బిన్నబోయాయి. రెండేళ్లపాటు అడ్డుకున్న అపజయాలను చిరునవ్వుతో ఓడించి, కెనడాలో కోటీ రూపాయల కొలువు కొట్టేశాడు ఖమ్మం జిల్లా యువకుడు కొమ్ము రాజేశ్. చింతకాని మండలం లచ్చగూడేనికి చెందిన వెంకటేశ్వర్లు-స్వరూప దంపతుల కుమారుడు రాజేశ్. రోజువారీ కూలీలైన వారిద్దరూ ఎన్నో కష్టాలకోర్చి కుమారుడిని చదివించారు. 2017లో తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మైనింగ్ కోర్సు పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఉద్యోగవేటలో ఉన్న అతడు ఆర్నెల్ల క్రితం కెనడాలోని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో కొలువు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సంస్థ పెట్టిన అన్ని పరీక్షలూ పాసైన రాజేశ్‌కు ఏడాదికి రూ.97,87,320 జీతంతో ఉద్యోగం ఆఫర్ చేసింది. జులై 28వ తేదీన విధుల్లో చేరాలంటూ నియామక పత్రాన్ని కూడా పంపింది. కొడుక్కి భారీ వేతనంతో ఉద్యోగం వచ్చేసరికి ఆ తల్లిదండ్రులు ఆనందోత్సహాల్లో మునిగిపోయారు.













