ఆటా వేడుకలు తిలకించండి
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో 18వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటాలో అంగ రంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ ఈ కాన్ఫరెన్స్‌కు వేదికగా ఉంది. అతి పెద్ద సమావేశాలు జరిగే ఈ వేదికపై ఆటా వేడుకలను 3రోజులపాటు ఘనంగా జరపనున్నాము. ఇప్పటికే ఈ కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా ప్రభుత్వ అధినేతలను, మంత్రులను, అధికారులను, ఎమ్మెల్యేలను, ఇతరులను ఆహ్వానించడం జరిగింది. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలకు వచ్చి మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రముఖ హీరోయిన్లు, సంగీత దర్శకులు తమన్, నేపథ్య గాయనీ గాయకులు ఇలా పలువురు ఈ వేడుకలకు వచ్చి అందరినీ రంజింపజేయనున్నారు. స్థానిక కళాకారులు ప్రదర్శించే కార్యక్రమాలు, సాహిత్యసమావేశాలు, మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలు, చిన్నపిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు, వధూవరుల పరిచయ వేదిక, భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం వంటివి ఎన్నో ఈ కాన్ఫరెన్స్‌లో చోటు చేసుకున్నాయి.
ఈ ఆటా కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకుని కొన్ని నెలలముందే కమిటీలను ఏర్పాటు చేసి కార్యక్రమాలకోసం ప్రణాళికలను, చేయాల్సిన పనులపై వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసి, అందరితో కలిసి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. అలాగే కాన్ఫరెన్స్ విజయానికి అవసరమైన నిధులకోసం, ప్రచారంకోసం వివిధ నగరాల్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి విరాళాలను సేకరించడం జరిగింది. అన్నీ నగరాల్లోనూ కాన్ఫరెన్స్ విజయవంతానికి చాలామంది ముందుకు వచ్చి విరాళాలను ఇవ్వడం సంతోషంగా ఉంది. అలాగే కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకుని వివిధ పోటీలను కూడా ఏర్పాటు చేశాము. రaుమ్మందినాదం పేరుతో సింగింగ్ పోటీలను, సయ్యంది పాదం పేరుతో నృత్యపోటీలను వివిధ నగరాల్లో నిర్వహించాము. అలాగే ఆటా పేజియంట్ పేరుతో అందాల పోటీలను కూడా ఏర్పాటు చేశాము. ఆటా చిత్రం, భళారే విచిత్రం పేరుతో మరో పోటీని కూడా నిర్వహించాము. వివిధ నగరాల్లో ఆటా కార్యక్రమాలు విజయవంతమైనట్లు, కాన్ఫరెన్స్ కూడా విజయవంతమవుతుందని భావిస్తున్నాను.
ఆటాలో హార్ట్ఫుల్నెస్ సెమినార్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం హైదరాబాద్ నుంచి దాజీ అట్లాంటా వస్తున్నారు. కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఆయన యోగ, మెడిటేషన్ వంటి కార్యక్రమాలతో అందరికీ ఆనందాన్ని ప్రశాంతతను కలగజేయనున్నారు. అందరూ వచ్చి ఈ హార్ట్ఫుల్నెస్ సెమినార్లో పాలుపంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఎన్నో కార్యక్రమాలతో, ఎంతోమందితో నిర్వహించే ఈ ఆటా కాన్ఫరెన్స్‌కు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమాలన్ని తిలకించి మా విందు భోజనాన్ని స్వీకరించాల్సిందిగా తెలుగు టైమ్స్ ద్వారా కోరుతున్నాను.







