అమెరికా వర్సిటీకి భారత సంతతి దంపతుల భారీ విరాళం
అమెరికాలో ఓ భారత సంతతి వైద్యుల జంట ఫ్లోరిడాలోని ప్రముఖ విశ్వవిద్యాలయానికి దాదాపు రూ.1,300 కోట్లు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. కిరణ్ పటేల్, పల్లవి పటేల్ దంపతులు, మయామి లోని నోవా సౌత్ఈస్టర్న్ విశ్వవిద్యాలయాన్ని (ఎన్ఎస్యూ)కి కొత్త ప్రాంగణ నిర్మాణం కోసం ఈ సాయం చేయనున్నారు. హృద్రోగ నిపుణుడైన కిరణ్, ప్రస్తుత ఫ్రీడమ్ హెల్త్ అనే వైద్యసేవల సంస్థను నడుపుతున్నారు. ఈ ఆర్థిక సాయంలో రూ.320 కోట్ల నగదును నేరుగా బహుమతిగా ఎన్ఎస్యూకి అందిస్తున్నారు. మిగతా రూ.980 కోట్లను 3.25 లక్షల చదరపు అడుగుల వైద్య విద్య సముదాయం, వసతుల నిర్మాణంలో పెట్టుబడులుగా పెడుతున్నారు. వీటిపై యాజమాన్య హక్కులు పటేల్ కుటుంబానికే ఉంటాయి. ఎన్ఎస్యూ వారికి అద్దెను చెల్లిస్తుంది. ఆరంభంలో ఏటా 250 మంది వైద్యులు ఇందులో శిక్షణ పొందుతారని, కొన్నేళ్లలో ఆ సంఖ్య 400కు చేరుతుందని కిరణ్ తెలిపారు. భారత్ నుంచి వచ్చే వైద్యులకు కూడా ఇక్కడ ఏడాది పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఫ్లోరిడా చరిత్రలో విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన విరాళాల్లో పటేల్ దంపతులు చేసిన తాజా వితరణ ఏడో అత్యధికం.













