దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య అరుదైన ఘటన
ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలను చల్లబరిచే అరుదైన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధికారి ఒకరు సరిహద్దు సముద్ర జలాల్లో దారుణ హత్యకు గురైన ఘటనపై ఉత్తర కొరియా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు. అధికారి మృతిపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ క్షమాపణ కోరారని, ఈ అనుకోని దురదృష్టకర సంఘటనకు ఆయన ఎంతో విచారం వ్యక్తం చేశారని దక్షిణ కొరియా అధికారులు ప్రకటించారు. ఇలా ఉత్తర కొరియా అధ్యక్షుడు క్షమాపణ చెప్పడం అత్యంత అరుదైన పరిణామమని విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరకొరియా పట్ల దక్షిణ కొరియాలో పెరుగుతున్న వ్యతిరేకతను చల్లబరిచేందుకు, ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడిపై పెరుగుతున్న విమర్శలు తగ్గించేందుకు కిమ్ క్షమాపణ కోరి ఉంటారని విశ్లేషిస్తున్నారు.













