అమెరికా అపనమ్మకం బయటపడింది : కిమ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన తన మలి భేటీపై అమెరికా ప్రభుత్వం అపనమ్మకం తో వ్యవహరించిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విమర్శించారు. రష్యాలోని వ్లాడివోస్టక్లో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కిమ్-పుతిన్ చర్చలు సుహృద్భావ వాతావరణంలో స్నేహపూర్వకంగా జరిగాయని కిమ్ తెలిపారు. అమెరికాతో తాము జరుపుతున్న అణు నిరాయుధీకరణ చర్చలను ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గాడి తప్పిస్తున్నందున ఆయన్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఉత్తర కొరియా ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిమ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుత పరిస్థితి యధాతథంగా వుందని, ఇదీ కీలక దశకు చేరుకుంటుందని కిమ్‌ను ఉటంకిస్తూ కెసిఎన్ఎ వెల్లడించింది. అమెరికా వైఖరి ఇలాగే కొనసాగితే కొరియా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని ఆయన హెచ్చరించారు.













