అమెరికాలో ఖమ్మం విద్యార్థి దుర్మరణం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. నగరానికి చెందిన కొండబాల పృథ్వీ(21) అమెరికాలోని కొలంబస్లో ద్విచక్రవాహనంపై వెళ్తూ డివైడర్ను ఢీకొని పక్కన ఉన్న లోయలో పడిపోయాడు. ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:30 సమయంలో సంఘటన జరిగినట్లు అతని మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. పృథ్వీ అక్కడి ఫ్రాంక్లిన్ యూనివర్సిటీలో ఇంజీనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నాడు.
పృథ్వీ తండ్రి కొండబాల కరుణాకర్ తిరుమలాయపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న తలిదండ్రులు బోరున విలపించారు. మూడు రోజుల్లో మృతదేహం వచ్చే అవకాశం ఉందనీ, తానా సంఘం నేతలు సహకరిస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు స్వర్ణకుమారి వారి నివాసానికి వెళ్లి బాధితులను ఓదార్చారు.













