Detroit: జోగేశ్వరరావు పెద్దిబోయినకు కేరళ క్లబ్ అవార్డు
డెట్రాయిట్ (Detroit) లోని సౌత్‌ఫీల్డ్ పెవిలియన్‌లో ఇటీవల నిర్వహించిన కేరళ క్లబ్ 50వ వార్షికోత్సవంలో తానా నాయకుడు, డిట్రాయిట్ తెలుగు ప్రముఖులు జోగేశ్వరరావు పెద్దిబోయిన (JogeswaraRao Pediboyina) కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన విశేష సేవలకుగాను ఈ అవార్డును ఆయనకు ఇచ్చారు. కోవిడ్-19 కాలంలో ఆయన నిర్వహించిన కార్యక్రమాలు, వివిధ కమ్యూనిటీల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టడం, డిట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా కమ్యూనిటీకి అందించిన సేవలు, ఐఎల్‌ఏ వైస్ ప్రెసిడెంట్, సాయిబాబా దేవాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, ఎస్వీ టెంపుల్ బోర్డు మెంబర్, ఐటీ సర్వ్ అధ్యక్షుడిగా, కేరళ క్లబ్ నిర్వహించే ‘‘అడాప్ట్-ఎ-రోడ్’’ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించినందుకు, ఆహార, వస్త్ర దాన కార్యక్రమాల నిర్వహణకు సహకరించినందుకు ఆయనను ఈ పురస్కారం వరించింది. తనకు ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందని, తన బాధ్యతను మరింత పెంచిందని జోగేశ్వరరావు అన్నారు.
2015లో తానా ప్రాంతీయ ప్రతినిధిగా, తానా సభల నిర్వాహక కమిటీ సభ్యుడిగా, ఈ ఏడాది జులై 3,4,5 తేదీల్లో నిర్వహిస్తున్న తానా మహాసభల కోశాధికారిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనకు ఈ అవార్డు ఇవ్వడం పట్ల ఆయన స్పందిస్తూ తన బాధ్యతను ఈ అవార్డు మరింత పెంచిందని, కమ్యూనిటీకి తాను సేవలుఅందిస్తూనే ఉంటానని చెప్పారు. ఆయనకు ఈ అవార్డు లభించడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి, జోగేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు.







