నిర్బంధ కేంద్రాల్లో ఉన్న పిల్లలను విడుదల చేయండి
అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన వారి కోసం ఉద్దేశించిన నిర్బంధ కేంద్రాల్లో తల్లిదండ్రులతో పాటు ఉన్న పిల్లలను విడుదల చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని ఇక్కడి జిల్లా కోర్టు ఆదేశించింది. జులై 17వ తేదీలోగా వారిని తల్లిదండ్రులతో సహా విడుదల చేయాలని, లేదంటే ఆదరించే వ్యక్తుల వద్దకు పంపించాలని సూచించింది. ఈ కేంద్రాల్లోనూ కరోనా వైరస్ వ్యాపిస్తున్న దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపింది. అక్రమ వలసదారుల కోసం టెక్సాస్, పెన్సిల్వేనియాలో మూడు నిర్బంధ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ కుటుంబ సభ్యులందర్నీ నిర్బంధించే అవకాశం ఉంది. ఈ మూడు కేంద్రాల్లో మొత్తం 184 మంది పిల్లలు ఉన్నారు.













