డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో జో బైడెన్
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి, మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌పై 12 పాయింట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ఈ మేరకు జూన్ 13 నుంచి 16 వరకు ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో జో బిడెన్ ఈ ఆధిక్యతను సాధించారు. ఎక్కువ మంది అమెరికన్లు జాత్యహంకారం, నిరుద్యోగం, కరోనా మహమ్మారి వంటి సమస్యలు దేశ స్థిరత్వానికి ప్రధాన ముప్పుగా భావిస్తున్నారు. ఈ పోల్‌లో దాదాపు 50 శాతం మంది జో బైడెన్‌కు మద్దతు ప్రకటించగా, ట్రంప్‌నకు కేవలం 38 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
గత నెలలో జో బైడెన్ 8 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించగా, నెల గడిచేసరికి మరో 4 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నారు. పోల్‌లో పాల్గొన్న వారిలో 31 శాతం మంది బైడెన్ పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించగా, 63 శాతం ట్రంప్ తిరిగి గెలుస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, అరిజోనా రాష్ట్రాల్లో బైడెన్ ముందంజలో ఉన్నారు. కొవిడ్ పరిస్థితులు, పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వెలువెత్తిన నిరసనల నేపథ్యంలో ఎక్కువ మంది ఓటర్లు బైడెన్ వైపు మొగ్గుచూపారు.













