డిజిటల్ తరగతుల లక్ష్యసాధన దిశగా ఎపి జన్మభూమి – జయరాంకోమటి
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలమేరకు ఎపి జన్మభూమి కింద ప్రభుత్వపాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దాదాపు 5వేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆయన రంగంలోకి దిగారు. ఎన్నారైలతో సమావేశమవడంతోపాటు ఎపి జన్మభూమి కో ఆర్డినేటర్ల ద్వారా ఈ లక్ష్యసాధనకు ఆయన కృషి చేస్తున్నారు. ఇప్పటికే లక్ష్యసాధనలో దాదాపు సగం పూర్తి చేసిన జయరామ్ కోమటి మిగతా సగాన్ని కూడా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. ఎన్నారైలతో సమావేశమవుతూ, వారిని మాతృసేవలో పాలుపంచుకునేలా చేస్తూ, విద్యాభివృద్ధిలో మీ తోడ్పాటు అవసరమని చెబుతూ, డిజిటల్ తరగతుల ఏర్పాటులో ఎన్నారైలను ఆయన పాలుపంచుకునేలా చేస్తున్నారు. ఎపి జన్మభూమి కో ఆర్డినేటర్లద్వారా ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఆయన ఏర్పాటు చేయిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతంను కలుసుకుని జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల డిజిటల్ తరగతుల వివరాలను ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నారైలు రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న సేవలను ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న జయరామ్ కోమటి వివిధ చోట్ల ఎన్నారైల సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవాల్లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించి నేటి విద్యావిధానంలో సాంకేతికతకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నారు.
తాజాగా కృష్ణాజిల్లాలోని పెదపరపూడి మండలం, దోసపాడులోని జడ్పిహైస్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవంలో జయరామ్ కోమటి పాల్గొన్నారు. నందిపాడు మండలం దోసపాడు, వెన్నసపాడు పాఠశాలల్లో జరిగిన డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా జయరామ్ కోమటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పైలా ప్రసాదరావు కూడా పాల్గొన్నారు.













