చదువుతోపాటు సాంకేతికత కూడా అవసరం – జయరామ్ కోమటి
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సాధారణ పాఠ్యాంశాలతోపాటు అధునాతన సాంకేతిక విద్యను కూడా అందిపుచ్చుకోవాలని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఉన్న జయరామ్ కోమటి అన్నారు. గుంటూరు మార్కెట్ కూడలిలోని హిందూ కళాశాల హైస్కూల్లో ఏపీ ప్రభుత్వ జన్మభూమి స్ఫూర్తితో న్యూయార్క్ ఆల్బని ఆంధ్ర సంఘం అధ్యక్షులు నిడమానూరి వెంటక శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతిగది ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించారు. వెంకట శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి తరగతి గదిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జయరామ్ కోమటి మాట్లాడుతూ నవ్యాంధ్రలో డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా 3000 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో మరో 2వేల పాఠశాలలో డిజిటల్ తరగతుల ద్వారా విద్యాబోధన చేసే కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.
దాత నిడమానూరి వెంకట శ్రీనివాస్ మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలో కళాశాలలో ఈ రోజు తమ తాతగారి పేరుతో డిజిటల్ తరగతి గది ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అధునాతన విద్యను అభ్యసించాలని అన్నారు.
సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న పాఠశాల విద్య ఆర్జేడీ కె.వి.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ గుంటూరు హిందూ కాలేజీ హైస్కూల్ ఎంతో విద్యాసేవ చేస్తున్నారని, పాలకమండలి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని అన్నారు.
సభకు పాఠశాల పాలకవర్గం అధ్యక్షులు జి.శివరామకృష్ణ ప్రసాద్ అధ్యక్షతన వహించగా, కార్యక్రమంలో కార్యదర్శి జీవైఎన్.బాబు, కార్యదర్శి మాజేటి ముత్యాలరావు, ప్రధానోపాధ్యాయులు ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.













