బాబు ఆశయసాధనకు కృషి చేస్తున్న ఎన్నారైలు – జయరామ్ కోమటి
ఆంధ్రప్రదేశ్‌ను అన్నీరంగాల్లో ముందుకు తీసుకువెళ్ళాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయసాధనకు అమెరికాలోని ఎన్నారైలు తోడ్పాటును అందిస్తున్నారని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి అన్నారు. ప్రకాశం జిల్లా ఉప్పలపాడు లో ఎన్ఆర్ఐ మువ్వా రవికిరణ్ సహకారంతో అభివృద్ధి చేసిన మహాప్రస్థానం, ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్‌రూమ్‌ను మాజీ ఎమ్మెల్యే బి.ఎన్. విజయకుమార్, ఎంపీపీ మేదరమెట్ల ఈశ్వరమ్మ, డీఈవో వి.ఎస్.సుబ్బారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో జయరామ్ కోమటి మాట్లాడుతూ రాష్ట్రానికి దూరంగా ఉన్న ఎన్ఆర్ఐలు నివసిస్తున్నప్పటికీ, వారు ఎల్లప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే మనస్సుపెట్టి ఉంటారని చెప్పారు. చంద్రబాబు చేపట్టిన జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు వచ్చారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద 150 శ్మశాన వాటికలను ఎన్ఆర్ఐల భాగస్వామంతో సుందరంగా తీర్చిదిద్దామన్నారు. జన్మభూమిపై మమకారంతో ఎన్ఆర్ఐ మువ్వా రవికిరణ్ స్వగ్రామానికి అందజేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఇలాగే ప్రతి ఎన్నారై గ్రామాభివృద్ధికి ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోరుకున్నట్లుగా దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు.













