జయరాం కోమటికి మాతృవియోగం
కోమటి కమలమ్మ మృతి పట్ల పలువురి సంతాపం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షుడు, ఎపి ప్రభుత్వ మాజీ ప్రతినిధి, తెలుగుటైమ్స్ చైర్మన్ జయరాం కోమటి తల్లి కోమటి కమలమ్మ గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం) 2:15లకు కన్నుమూశారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. కమలమ్మ భర్త కోమటి భాస్కరరావు కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యేగా సేవలందించారు. కమలమ్మకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు జయరాం కోమటి అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమారుడు సుధాకర్ కోమటి, కూతురు మైలవరంలోనే ఉంటారు. కరోనా వైరస్ కారణంగా అమెరికా నుంచి ఇండియా వచ్చే అవకాశాలు లేకపోవడంతో జయరాం కోమటి తాను ఈ సమయంలో ఇండియాకు వెళ్ళలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని అన్నారు. కరోనా ఇబ్బందుల కారణంగా ఈరోజు ఉదయమే తల్లి అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు చిన్నకుమారుడు సుధాకర్ కోమటి తెలిపారు. జయరాం మేనల్లుడు అప్పసాని సందీప్, ఇతర కుటుంబ సభ్యులు మైలవరంలోనే ఉంటున్నారు.
కాగా కమలమ్మ మృతి పట్ల పలువురు ఎన్నారైలు జయరాం కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, తానా కార్యదర్శి రవి పొట్లూరి, హరనాథ్ పొలిచెర్లతోపాటు బే ఏరియాలోని బాటా నాయకులు, తానా నాయకులు పలువురు తమ సంతాపాన్ని తెలియజేశారు.
తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు, తెలుగు టైమ్స్ సిబ్బంది కూడా కమలమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.













