కృష్ణా జిల్లాలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు 35 లక్షలు విరాళం
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి సహాయపడుతున్నట్లుగానే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న తానా మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి కృష్ణాజిల్లాలో ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకోసం 35లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్నారైల సహకారంతో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయించిన జయరామ్ కోమటి తాజాగా కృష్ణా జిల్లాలోని అన్నీ ప్రభుత్వ స్కూళ్ళలో కూడా డిజిటల్ తరగతుల ఏర్పాటుకు 35 లక్షల రూపాయలను ఎన్నారైల తరపున కృష్ణా జిల్లా కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్‌కు అందజేశారు.
డిజిటల్ తరగతుల ఏర్పాటు వల్ల విద్యార్థులు చదువులో మరింతగా రాణిస్తారని, నేటి విద్యావిధానానికి డిజిటల్ తరగతుల బోధన ఎంతో అవసరమని జయరామ్ కోమటి చెప్పారు. అందుకే తాను ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నారైలు ఎందరో ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారని కూడా చెప్పారు. కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి జయరామ్ చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని చెప్పారు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖుడు, అమెరికాలో ఉంటున్న కార్డియాలజిస్ట్ లకిరెడ్డి హనిమిరెడ్డి కూడా జన్మభూమికి ఎంతో సేవ చేస్తున్నారని, డిజిటల్ తరగతుల ఏర్పాటులో కూడా ఆయన పాత్ర ప్రశంసనీయమని జయరామ్కోమటితో పాటు హనిమిరెడ్డి సేవలను కూడా కలెక్టర్ ప్రశంసించారు.













