కళ్యాణ వైభోగమే!
అంగరంగ వైభవంగా జరిగిన జయరామ్ కోమటి కుమార్తె పెళ్ళి
అమెరికాలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రముఖ వ్యక్తిగా పేరు పొందిన తానా మాజీ అధ్యక్షుడు, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి కుమార్తె వివాహం విజయవాడలో ఆగస్టు 29వ తేదీన సికె కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రముఖులు, అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైలు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వివాహం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుని సాగింది.
అమెరికాలోనే పుట్టిన అమ్మాయి, అబ్బాయి తమ వివాహాన్ని మన సంస్కృతీ సంప్రదాయానుసారం జరుపుకోవాలన్న ఆకాంక్షతో ఇక్కడకు వచ్చి వివాహం చేసుకోవడం అందులో మొదటిది.
అమెరికాలో బిజినెస్ మేనెజ్మెంట్లో గ్రాడ్యుయేట్ చేసి ప్రస్తుతం యుకెలో ఓ ఫార్మాకంపెనీలో పనిచేస్తున్న జయరాంకోమటి కుమార్తె మేఘన మన పెళ్ళి సంప్రదాయాలపై ఆసక్తితో తన వివాహ వేడుకలను బంధుమిత్రుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో జరగాలని కోరుకుంది. అదే విధంగా స్వీడన్లో పుట్టి అమెరికాలో పెరిగిన మార్సెల్ చూదొబ యుకెలో ఉద్యోగం చేస్తున్నాడు. మేఘన, మార్సెల్ మధ్య చిగురించిన ప్రేమ చివరకు పెళ్ళికి దారి తీసింది. రెండు కుటుంబాలకు చెందిన తల్లితండ్రులు చికాగోలో కలుసుకుని ఈ పెళ్లికి ఆమోదముద్ర వేశారు. ఈ సమయంలోనే తెలుగు సంప్రదాయం ప్రకారం విజయవాడలో పెళ్ళి చేయాలన్న సూచనకు పెళ్లికొడుకు తల్లితండ్రులు అంగీకరించారు. 5 రోజులపాటు వివాహ వేడుకలను వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నారు.
ఆగస్టు 25 నుంచి ప్రారంభమైన పెళ్ళి సందడి…
పెళ్లి వేడుకల కోసం అమెరికా నుంచి వచ్చిన వరుడు మార్సెల్‌కు, వారి కుటుంబ బంధు మిత్రులకు జయరామ్ కోమటి, బంధుమిత్రులు ఏర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు. వారిని సంప్రదాయరీతిలో పూలమాలలు వేసి, తలపాగా పెట్టి ఆహ్వానించారు. వరుడి తరపువారికి ఓ విల్లాలో, ఇతరులకు పెద్ద హోటళ్ళలో విడిదిని ఏర్పాటు చేశారు. దాదాపు 45 మంది వరుడి తరపువారు ఈ వేడుకల కోసం విజయవాడకు తరలివచ్చారు.
పెళ్ళి కార్యక్రమాల్లో భాగంగా 26వ తేదీన తన సొంతూరైన మైలవరం మండలం వెల్వడం గ్రామంలో బంధుమిత్రులు, గ్రామ ప్రజల సమక్షంలో పెళ్ళికూతురు వేడుకలను జయరాంకోమటి దంపతులు ఘనంగా జరిపించారు. దాదాపు 5వేలమంది ఈ వేడుకలకు హాజరయ్యారు. 27వ తేదీన విజయవాడలో కృష్ణానది ఆనుకుని ఉన్న పాతూరి నాగభూషణం విల్లాలో జరిగిన వేడుకల్లో కూడా ఎంతోమంది పాల్గొన్నారు. బే ఏరియా నుంచి వచ్చిన ఎన్నారైలు, తానా నాయకులు, జయరామ్ కోమటి బంధుమిత్రులు ఇతరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెళ్ళికొడుకు, వారి బంధుమిత్రులు, జయరామ్ కోమటి, వారి బంధుమిత్రులు ఎపి టూరిజం శాఖ బోటులో కృష్ణానదిలో విహరించారు. రెండు గంటలపాటు సాగిన వారి బోట్ షికారులోనే ఆతిధ్యం, డిజె వంటి కార్యక్రమాలు జరిగాయి. బోటు నుంచి తిరిగి క ష్ణానది తీరానికి వచ్చినప్పుడు బ్రాహ్మణులు మేళతాళాలు, మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణానదికి హారతి ఇచ్చారు. బాణాసంచా కాల్చారు. ఘనంగా జరిగిన ఈ వేడుకలను తిలకించి వరుని తరపువారు పులకించిపోయారు. అదే సమయంలో చిన్నపాటి వర్షం కురియడంతో వారు మాన్సూన్ వెడ్డింగ్ ఇదేనంటూ వ్యాఖ్యానించారు.
28న ప్రి వెడ్డింగ్ రిసెప్షన్
పెళ్లి వేడుకల్లో భాగంగా ఆగస్టు 28న ప్రి వెడ్డింగ్ రిసెప్షన్‌ను భారీగా నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, ప్రముఖులు, ఎన్నారైలతోపాటు పలువురు బంధుమిత్రులు పాల్గొన్నారు. సంగీత్ కార్యక్రమం కూడా నిర్వహించారు. వరుడి తరపు బంధువులు, వధువు తరపు బంధువులు నృత్యం చేస్తూ హాల్లోకి ప్రవేశించడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
29న ఘనంగా జరిగిన పెళ్ళి వేడుకలు
వివాహ వేడుకల్లో అత్యంత రమణీయ ఘట్టం 29వ తేదీన సి.కె. కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు వచ్చిన వారితో హాలు క్రిక్కిరిసిపోయింది. ఎంతోమంది ప్రముఖులు, ఎన్నారైలు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పెళ్ళికొడుకు సంప్రదాయానుసారం తెల్లవారుజామునే జరిగిన వ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు పెళ్ళికూతురు మేఘన, తల్లితండ్రులు జయరామ్ కోమటి, కల్పన గౌరీ పూజను చేశారు. రాత్రి 11.32 నిముషాలకు ముహూర్త సమయంలో వధూవరులు జీలకర్ర, బెల్లం ఒకరిపై ఒకరు ఉంచడంతో ప్రధాన వివాహ ఘట్టం ముగిసింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వేదికపైకి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు వచ్చినవారంతా పాశ్చాత్య దేశంలో పుట్టి పెరిగినప్పటికీ భారతీయ సంప్రదాయ వివాహ వేడుకలపై వరుడితోపాటు వారి బంధుమిత్రులు ఆసక్తిని చూపడంతో పాటు ఉత్సాహంగా పాల్గొనడం ఆకట్టుకుంది.
భారతీయ సంస్కృతి నాకెంతో నచ్చింది – మార్సెల్
నేను 8ఏళ్ళ క్రితం ముంబై వచ్చినప్పుడు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకున్నాను. మేఘనతో పరిచయమైన తరువాత తెలుగు సంస్కృతిపై ఆసక్తి కలిగింది. పెళ్ళి వేడుకల్లో జరిగే సంప్రదాయాన్ని పాటించడంతోపాటు దాని వెనుక ఉన్న అర్థాన్ని కూడా తెలుసుకున్నాను. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది.
పెళ్ళికి ముందురోజు జరిగిన సంగీత్ కార్యక్రమంలో ఆడుతూ పాడుత ఎంజాయ్ చేసేటప్పటికీ టైమ్ అర్థరాత్రి దాటి పోయింది. ఆ సమయంలో నేను తెల్లవారుజామున 5.30 కు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పారు. 2 గంటలకు నిద్రపోయిన నేను వేకువఝామున 4.30కు లేచి స్నానం చేసి 5.30కు జరిగే కార్యక్రమంలో పాల్గొన్నాను. సంప్రదాయంపై మక్కువ కారణంగా నాకు నిద్ర కన్నా వేడుకల్లో పాల్గొనడమే ముఖ్యమని అనిపించింది.
అందరి ఆశీర్వాదం లభించడం అదృష్టం – మేఘన
పెళ్ళి కుమార్తె మేఘన మాట్లాడుతూ, సంప్రదాయంగా పెళ్ళి చేసుకోవాలన్న నా కోరిక తీరింది. ఎంతో సంబరంగా ఈ వేడుకలను జరిపించిన తల్లితండ్రులతోపాటు, నన్ను ఆశీర్వదించిన ఎంతోమంది పెద్దలకు నేను ధన్యవాదాలను తెలుపుతున్నాను.
అందరికీ ధన్యవాదాలు – జయరామ్ దంపతులు
జయరామ్ దంపతులు మాట్లాడుతూ, మా కుమార్తె మంచి వరుడినే ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మన సంస్కృతిపై మక్కువతో ఉన్న మార్సెల్‌ను చూసి మేము గర్వపడుతున్నాము. ఈ వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించడంలో ఎంతోమంది సహకరించారు. వారికి, వివాహానికి వచ్చిన ప్రముఖులకు, బంధుమిత్రులకు ఇతరులకు ధన్యవాదాలను తెలియజేస్తున్నాము.













