ATA: ఆటా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన జయంత్ చల్లా
అమెరికా తెలుగు సంఘం (ATA) ట్రస్ట్ బోర్డ్ సమావేశం వర్జీనియా రాష్ట్రం లోని యాష్ బర్న్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా మాట్లాడుతూ, ఆటా ప్రధాన లక్ష్యాలను వివరించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగుజాతికీ, వారి సాంస్కృతిక వారసత్వానికి, తెలుగు సాహిత్యానికి, సాంస్కృతిక, విద్యా సామాజిక కార్యకలాపాలు ప్రోత్సహించటానికి ఆటా అన్నివేళలా కృషి చేస్తూ ఉంటుందని పునర్దాటించారు. తనతో పాటు ఏర్పడబోయి కార్యనిర్వహక బృందం తమ తదుపరి రెండు సంవత్సరాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రణాళికను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఇమిగ్రేషన్ పైన అవగాహన సదస్సులు, అమెరికాలో ఉండే హైస్కూల్ విద్యార్థులకు ఉచిత శిక్షణ, కాలేజీ ప్రవేశాలపై అవగాహన సదస్సులు, భారత్ దేశం నుండి తాత్కాలికంగా వచ్చే తల్లితండ్రులకు ఉచిత వైద్య, దంత క్యాంపు, అవసరమైనవారికి ఆర్థిక సాయం అందించడం చేశామని తెలిపారు. జయంత్ చల్లా టీం వచ్చే రెండు సంవత్సరాలు లక్ష డాలర్లను ఆటా సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ప్రకటించింది.
ఆటా నూతన కార్య నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి రామశయం, సెక్రటరీ సాయినాథ్ బోయపల్లి ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జాయింట్ సెక్రటరీ నర్సిరెడ్డి గడ్డికోపుల జాయింట్ ట్రెజరర్ విజయ్ తుపల్లి ఎగ్జిక్యూటివ్స్ డైరెక్టర్ అరవింద్ ముప్పిడి ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆటా బోర్డ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతోపాటు, వర్జీనియా, మేరీల్యాండ్ నివసిస్తున్న తెలుగు వారు కలిపి 200 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.







