ఆరోగ్యకిట్లు అందజేస్తున్న ఎన్ఆర్ఐ జలగం సుధీర్
కన్న ఊరికి, తోటి గ్రామస్తులకు సాయంచేయాలనే తలంపుతో అనంతగిరి గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ జలగం సుధీర్ ఆరోగ్యమే లక్ష్యంగా నాయీ బ్రహ్మణలకు మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. వృత్తిరీత్యా నాయీ బ్రాహ్మణులు చేతులకు, కాళ్లకు గాయాలైన సమయంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ప్రథమచికిత్స తీసుకునేందుకు అవసరమైన ప్రాథమిక కిట్లను అందజేసేందుకు నడుంబిగించారు. ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో మండలంతోపాటు చిలుకూరు, మునగాల, నడిగూడెం మండల్లాలోని నాయీ బ్రాహ్మణులకు మెడికల్ కిట్లు అందజేశారు.
అంతేగాక డీఎస్పీ సుదర్శన్రెడ్డితోపాటు మరికొంతమంది అధికారులకు నాయీబ్రాహ్మణుల ఆరోగ్యానికి కిట్లు ఏవిధంగా దోహదపడతాయో వివరిస్తూ, కిట్ల పంపిణీ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. డాక్టర్ల సహకారం తీసుకొని కిట్లను ఏవిధంగా ఉపయోగించాలో అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడి సెంటర్లకు కిట్లను పంపిణీచేసి, తన వితరణను చాటుకుంటున్నారు. నాలుగు మండలాల్లో సుమారు 500 మెడికల్ కిట్లు, ఆరోగ్య పరిరక్షణకు మరో రెండు లక్షల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్లు సుధీర్ తెలిపారు. తనతో పాటు తన స్నేహితుల సహాయం తీసుకుని కిట్ల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రమంతా తిరగటం కుదరకపోవటంతో సొంత ఊరిలోనే కిట్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కిట్ల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, అనాథలకు సంరక్షణ కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణరావుకు విన్నవించినట్లు తెలిపారు. మన ఊరు, మన ఎన్ఆర్ఐ అనే నినాదంతో ఎన్ఆర్ఐలు గ్రామాల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సుధీర్ మెడికల్ కిట్ల పంపిణీ పట్ల ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.













