అమెరికాలో ప్రమాదం.. తెలంగాణ చిన్నారి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్పల్లి కాలనీకి చెందిన ఓ కుటుంబం అమెరికాలోని జాక్సన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు అల్వాన్పల్లి కాలనీకి చెందిన సుశీల్ రెడ్డి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని అలబామాలో పదేండ్లుగా నివాసం ఉంటున్నారు. భార్య భర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మార్చి 29న సుశీల్ రెడ్డి తన కుమారుడి కోసం క్రానియల్ పేషియల్ థెరపీ స్టేషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా జాక్సన్కౌంటీలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుశీల్ రెడ్డితో పాటు అతని భార్య అనూష, ఇద్దరు కొడులు అద్వైత్ రెడ్డి, శ్రేయస్ వినాన్ (ఏడాది) తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి శ్రేయాస్ వివాన్ మృతి చెందాడు. సుశీల్ రెడ్డి, మరో కొడుకు అద్వైత్ రెడ్డి కోమలోకి వెళ్లగా, అనూష కాళ్లకు సర్జరీ అయ్యింది.







