హైదరాబాద్ కు రానున్న ట్రంప్ కుమార్తె
హైదరాబాద్ నగరంలో జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సమ్మేళనానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక హాజరవుతున్నారని సమాచారం. భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అమెరికా పర్యటించినప్పుడు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు రావాల్సిందిగా ట్రంప్ కుమార్తెను ఆహ్వానించారు. ఇవాంక కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి రావడానికి సంసిద్ధతను తెలియజేశారు. దీంతో అమెరికా – భారత్ కలిసి ఈ పారిశ్రామికవేత్తల సదస్సును పెద్దఎత్తున నిర్వహిస్తున్నాయి.
ఇవాంకా ఒకటిన్నర రోజులు హైదరాబాద్లో…
ప్రపంచ పారిశ్రామికవేత్తల సమ్మేళనానికి రావాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానాన్ని ఆమోదించిన ఇవాంకా అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్లో ఆమె ఒకటిన్నర రోజులు ఉండే అవకాశముందని అమెరికా రాయబార కార్యాలయవర్గాల సమాచారం. ఆమె పర్యటనపై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయ అధికారులు కసరత్తు చేపట్టారు. ఈ సమ్మేళనంలో ప్రపంచ యవనికపై హైదరాబాద్ ప్రభ మరోమారు తళుకులీననుంది.













