మూడేళ్ల కంటే తక్కువకే హెచ్-1 బీ లా!
అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యుఎస్ఐసీఎస్)పై దాదాపు వెయ్యి ఐటీ కంపెనీలు సంయుక్తంగా ఓ కేసు వేశాయి. మూడేళ్ల కనీస కాలపరిమితికి జారీ చేయాల్సిన హెచ్-1బీ వీసాలను అంతకంటే బహు తక్కువ కాలపరిమితికి ఆ విభాగం జారీ చేస్తోందని ఆ కంపెనీల ఆరోపణ. ఐటీ సెర్వ్ అలయన్స్ పేరిట ఓ బృందంగా ఏర్పడ్డ ఈ చిన్నా చితకా కంపెనీల్లో ఎక్కువ భాగం భారతీయులు నిర్వహిస్తున్నవే. సాధారణంగా హెచ్-1బీ నాన్ ఇమిగ్రెంట్ వీసాలను మూడేళ్ల కనీస కాలపరిమితికి జారీ చేసి మరో మూడేళ్లపాటు పొడిగిస్తారు. డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన అమెరికా ఫస్ట్ విధానం వల్ల అనేక కంపెనీలు విదేశీయులను ఈ వీసా విధానం వల్ల పనిలోకి తీసుకోలేని పరిస్థితి ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఇపుడు యూఎస్ఐసీఎస్ ఆ మూడేళ్ల కనీస పరమితిని కూడా తక్కువ చేసేసి కొద్ది నెలలకో, కొన్ని సార్లు కొద్ది రోజులకో కూడా హెచ్-1బీ వీసాలను అనుమతించేస్తోందని, ఇది చట్టానికి వక్రభాష్యం చెప్పడమేనని, ఇలా చేసే అధికారం ఇమిగ్రేషన్ విభాగానికి లేదని ఆ కంపెనీలు తమ దావాలో పేర్కొన్నాయి. కాల పరిమితి తగ్గించడం వల్ల అనేకమంది నిపుణులకు సైతం అవకాశాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆ గ్రూప్ పేర్కొంది.













