ఆంక్షలు ఎత్తివేస్తేనే అమెరికాతో చర్చలు
తమపై మోపిన ఆంక్షలను ఎత్తివేస్తేనే అమెరికాతో సంప్రదింపులు జరిపే అంశంపై ఆలోచిస్తామని ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహాని పునరుద్ఘాటించారు. ఆంక్షలు ఎత్తివేసేంత వరకు అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండబోవని సృష్టం చేశారు. ఇరాన్ స్టేట్ మీడియాతో రౌహాని మాట్లాడారు. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా కుట్ర పన్నిందన్నారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న దేశాలను ఆంక్షల పేరిట బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. అగ్రరాజ్యం ఆటలు ఎంత కాలం సాగవని హెచ్చరించారు. ఇరాన్ను కాళ్లబేరానికి రప్పించుకోవాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయని అన్నారు. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు దెబ్బతిన్నాయని, బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అమెరికా ఆంక్షలు నుంచి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇరాన్ అణు ఒప్పందానికి రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మద్దతును కొనసాగిస్తున్నాయని అన్నారు.













