అమెరికా ఆంక్షలకు తలొగ్గం
అమెరికా ఆంక్షలకు తలొగ్గమని ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ పునరుద్ఘాటించారు. ఇరాన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా తమ పట్ల అవలంభిస్తున్న ఘర్షణాయుత వైఖరి విఫలం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. న్యూయార్క్‌లో జరిగిన 73వ ఐరాస భద్రతా మండలి సమావేశంలో రౌహానీ ప్రసంగించారు. అమెరికా తమపై ఏకపక్షంగా ఆంక్షలు విధించడం ద్వారా ఆర్థిక యుద్దం జరుపుతోందని విమర్శించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్న కారణంగా 2015లో కుదిరిన బహుళ జాతి అణు ఒప్పందం కింద ఆంక్షలు తొలగించబడ్డాయి. వాటిని మళ్లీ ఇరాన్‌పై విధించడంపై రౌహానీ తీవ్రంగా విమర్శించారు. ఇరాన్ పౌరుల ఆకాంక్షలను ప్రతిఘటించాలనే వారి దకృథం, ప్రతిసారీ విఫలమవుతూనే వస్తోందని రౌహాని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ చమురు, బ్యాంకింగ్ రంగంపై ఈ ఏడాది నవంబరులో మరింత తీవ్రమైన ఆంక్షలను ట్రంప్ విధించే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని అన్నారు. కొత్త ఆంక్షల పేరిట అమెరికా ప్రారంభించిన ఆర్థిక యుద్ధం కేవలం ఇరాన్ ప్రజలను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదని, ఇతర దేశాల ప్రజలపై కూడా ప్రమాదకరమైన పర్యవసానాలు కలిగించే విధంగా ఉన్నాయని విమర్శించారు.













