మన శరీరంలో మరో కొత్త అవయవం
మన శరీరంలో కళ్లు, ముక్కు, నోరు, గుండె, కాలేయం, కిడ్నీలు ఇలా ఎన్నో అవయవాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఇప్పటి వరకు మనం గుర్తించని ఓ అవయవ వ్యవస్థను అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ లాంగాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అవయవం పేరు ఇంటర్ స్టిటియమ్. కొత్తగా గుర్తించిన ఈ అవయవం ఎక్కడో ఒక మూలన ఉండేది కాదు. శరీరమంతటా విస్తరించి ఉండేది కావడం గమనార్హం. ఇది శరీర కణజాలాల మధ్య వివిధ రకాలైన ద్రవ పదార్థాలతో నిండి ఉండి, పూర్తిగా అనుసంధానమై ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలో చర్మం కింద, జీర్ణ వ్వవస్థలో, ఉపిరితిత్తులు, మూత్రపిండ వ్యవస్థలలో, కండరాల చుట్టూరా ఈ ఇంటర్ స్టిటియమ్ అవయవ వ్యవస్థ ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన పథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నీల్ థైస్ వెల్లడించారు.













