ఆన్లైన్ క్లాసులను ఎంచుకున్న వారు దేశం వీడాల్సిందే
అమెరికాలోని లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపేలా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కారణంగా విద్యాసంస్థలు పూర్తిగా ఆన్లైన్ తరగతుల నిర్వహణకు మారితే, ఆ కాలేజీల్లోని విదేశీ విద్యార్థులు అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఐసీఈ) మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే సెప్టెంబరు నుంచి డిసెంబర్ వరకు నిర్వహించనున్న సెమిస్టర్‌కి సంబంధించి కొత్తగా వీసాలు జారీ చేయబోమని కూడా సృష్టం చేసింది. చట్టబద్ధంగా ఉండాలనుకునే వారు భౌతికంగా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించే విద్యా సంస్థలకు బదిలీ కావాలని, లేదంటే ఇమిగ్రేషన్ తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని ఐసీఈ హెచ్చరించింది. మరోవైపు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు మాధ్యమాల (హైబ్రిడ్) ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంస్థలు తమ విద్యార్థులు భౌతికంగా హాజరవుతున్నారని నిరూపించుకోవాలని సృష్టం చేసింది.
ఈ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఒకటి కంటే ఎక్కువ లేదా త్రీ ఆన్లైన్ క్రెడిట్ అవర్సే అనుమతిస్తారు. కోర్సును పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడం లేదని, విద్యార్థులు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటీకి హాజరవుతున్నారని సందరు విద్యా సంస్థ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ పోగ్రామ్‌కు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంది.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది విదేశీ విద్యార్థులకు ఆశనిపాతంలా మారింది. ముఖ్యంగా సెప్టెంబరులో ప్రారంభం కానున్న సెమిస్టర్లో అడ్మిషన్ పొందాలని చూస్తున్న విదేశీ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు అమెరికా నిర్ణయంతో అక్కడి విద్యాసంస్థలన్నీ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.













